పొగడ్తల కి పడిపోని వాళ్ళు ఉంటారా?

0

సాగరసంగమం సినిమాలో కుమారి శైలజని నాట్యంలో తీర్చిదిద్దింది బాలూ యే అనీ..బాలు గొప్ప డాన్సర్ అనగానే హాలంతా చప్పట్లు మోగుతుంటే …చావుబతుకుల్లో ఉన్న బాలు కొట్టండీ ఇంకా బాగా చప్పట్లు కొట్టండీ అన్నట్టు చేతులాడిస్తాడు.

ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల రావు పక్కన ఇద్దరు డప్పు మేళంగాళ్ళుంటారు. ఎవ్వరు పొగిడినా డబ్బు వాయించి పొగడ్తున్నారని తెలియజేస్తారు. పొగడ్తలకి పొంగి తాను ఎక్కడ డబ్బులు తీసుకోకుండా పని చేస్తానో అని అలా ఇద్దరిని పెట్టుకుంటాడు విలన్ ఆ సినిమాలో.

పొగడ్త…పదిమందిలో గొప్ప…కీర్తి ..ఒకవిధంగా మానవజాతిని ముందుకునడిపిస్తున్నది ఇదేకదా!!

పొగడ్త అనేది ఒక పాజిటివ్ పిల్.. ప్రతివారికీ .. ప్రతి విషయానికీ అవసరం. పిల్లలు పెద్దలు.. కులం..మతం..ప్రాంతం..పండగ.. సంస్కృతీ సంప్రదాయాలూ తిండి బట్ట కట్టు బొట్టు..పని పాట…చెట్టూ పుట్టా దేవుడూ దయ్యం .. కాదేదీ పొగడ్తకనర్హం.

నిజానికి పొగడ్త అంటే లేనిది చెప్పటం కాక.. ఉన్న పాజిటివ్ పాయింటుని చెప్పటం. అలా చెప్పటం వల్ల ఒక కొత్త ఉత్సాహం అందుతుంది. 

మనుషులని, వాళ్ళ పనిని..ప్రాంతాన్నీ,ప్రవర్తననీ, అలవాట్లనీ, ఆలోచనా దృక్పథాన్ని..ఇంకా మరేదైనా విషయాన్ని నిజంగా నిజాయితీగా పొగడటం అనేది ఒక ఆర్ట్.

అమ్మాయిలని పొగిడితే పొంగిపోతారనీ…ఆ ఆనందంలో మనని ఇష్టపడే చాన్సు( పామరబాషలో పడే చాన్సు) ఉందీ అని అంటుంటారు. ” ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ “, వాలు చూపు సోకితే అందరూ తేలిపోతారో లేదో తెలియదు కానీ పొగిడ్తకి మాత్రం తప్పకుండా తేలాల్సిందే ఎవ్వరైనా. అందదాకా ఎందుకు అసలు దేవుడిని పూజించటం అంటే ఏమిటీ ? పొగట్టమేగా..అంగాగ వర్ణనా, వాళ్ల లీలలూ..ఎందుకు గొప్ప..ఎలాగొప్ప అని గొప్పగా చెప్పటమేగా.. అలా దేవుడి మీద పొగడ్తల పాటలు కట్టి జన్మ సార్థకం చేసుకున్న వాళ్ళేగా గొప్ప కవులూ రచయితలుగా మనం చెప్పుకునేది. వేదవ్యాసుడు మొదలు.. పురంధరదాసు..రామదాను..అన్నమయ్య.. త్యాగయ్య.. వీళ్లంతా చేసిందదేగా !! 

ఆధునిక కవి ఏం చేస్తాడు.. జీవితాన్నీ..ప్రకృతినీ ..ప్రేమనీ..జీవితానందాన్నీ పొగడ్డూ..!

ప్రతి విషయానికో దేవుడూ/దేవతా.. ఆదేవతని పొగిడే శ్లోకాలూ..స్త్రోత్రాలూ దండకాలూ ఇవ్వేగా దైవకృప పొందటానికి మనకున్న దిక్కు !!

అసలు పొగడ్తలకోసం, పదిమందిలో గొప్ప అనిపించుకోటం కోసం ( కీర్తి కాంక్ష) ఎన్నో కష్ట, నష్టాలకోర్చి కొత్త సవాళ్లని స్వీకరించి మనుషులు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటుంటారు. 

ప్రతి మనిషీ కాసింత పొగడ్తకోసం పాకులాడుతాడు. చిన్న పొగడ్త దొరికితే ఉబ్బి తబ్బిబ్బయ్యి రెట్టించిన ఉత్సహంతో పని చేస్తాడు. తెలివైన మేనేజర్ తిట్లతో కాక పొగడ్తలతో పని చేయించుకుంటాడు. అలాగే తెలివైన తల్లిదండ్రులు పొగడ్తలతొ పిల్లలని సరైన దారిలోకి తెస్తారు. జంతు బాషమనకి రాదు కనన బాడీలాంగ్వేజ్ “దువ్వటం” వాడుతాం. సరిగ్గా దువ్వితే క్రూరమృగాన్ని సైతం మచ్చిక చేసుకోవచ్చు. మనుషులని మాటలతో దువ్వటమే పొగడ్త .

మనలో లేనిది ఎదుటివాళ్ళలో ఉంటే మనం ఆ మనిషిని అడ్మైర్ చేస్తాం. వీలైతే పరిచయం చేసుకుంటాం. అటు మీద పరిచయం పెరిగి స్నేహం చిగురించేది ఈ పొగడ్తవల్లే. అయితే పొగడ్త నిజాయితీగా ఉండాలి. లేని విషయాన్ని పొగడ్తలో చెప్పలేము. వాళ్ళలో వాళ్లకే తెలియని విషయాన్ని పొగడ్తలో చొప్పిస్తే అవునా..నేనెప్పుడూ గమనించలేదూ అంటూ వాళ్ళు ఇంకా హాయిగా ఫీలయ్యే అవకాశం ఉంది. ఆ హాయిలో స్నేహం కొత్తమొగ్గలు వేస్తుంది.

భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అడ్మైర్ చేసుకుంటూ..ఒకరి గొప్పని మరొకరు చెప్పుకుంటూ ఉంటే ఆ కాపురం పదికాలాలూ చల్లగా ..చక్కగా..సుఖంగా సాగుతుంది. అదే ఒకరితప్పులొకరు ఏకరువు పెట్టుకుంటూ..ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే మూణ్ణాళ్ళ ముచ్చట గా కుప్పకూలుతుంది.

స్కూళ్ళో విధ్యార్థులని పొగడితే చక్కగా వృద్దిలోకొస్తారు. అలాగే ఇంట్లో పిల్లలని సరైన సమయంలో సరిగ్గా…మోతాదులో పొగడ్డం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.

ఫలానా విషయంలో పొగడించుకోవాలనే కదా మనం కొన్ని పనులని తలపెడ్తాం. రానిపనినీ..మనలో లేని విషయాన్ని కూడా అందిపుచ్చుకోవాలనే ప్రయత్నం మొదలెడతాం.

అప్పట్లో రాజులు ఓ నలుగురు కవులని తన సభలో పోషించేవాడు తనని పొగట్టానికే. తమ చరిత్రలూ, వంశ చరిత్రలూ ఎన్నో రాయించుకున్నారు..కొన్నిసార్లు కవులే వాటిని రాసి రాజుని సంతృప్తి పరిచి భారీగా బహుమతులు పొందేవాళ్ళు. గొప్ప కావ్యాలన్నీ పొగడ్తల కథలే !!

అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి ఈ పొగడ్తకీ వర్తిస్తుంది. అతిగా పొగడటం వల్ల పొగడ్త పవరు తగ్గుతుంది. అలాగే అతిగా పొగడ్తలకి అలవాటు పడితే ఇహ మన గతి అధో గతే. అన్ని విషయాల్లో నిజాయితీ లోపించినట్టే.. ప్రస్తుత కాలంలో ఈ పొగడేవాళ్లలో కూడా నిజాయితీ లోపించింది. ఉన్నవీ లేనివీ చెపుతూ మనని పడేసి పని చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు. మన తెలుగుహీరోల చుట్టూ ఓ భజన బాచీ ఉంటుంది. వాళ్ళని దేవుడికంటే గొప్పగా పొగట్టం వల్ల ఒక చట్రంలో ఇరుక్కుంటారు. కొత్త కథలు, ప్రయోగాల జోలికి వెళ్ళకుండా మూస పోకడ సినిమాలు తీసేది ఈ భజన బాచీ వల్లే !!

కథా..కాకరకాయా లేకుండా కేవలం పొగడ్తలతో హీరో డేట్లు.. నిర్మాత నోట్లు పట్టే దర్శకులు చాలామందే ఉన్నారు. కానీ అదంతా సినిమాతీసే వరకే పనిచేస్తుంది. ఈ పొగడ్తలకోసమేగా .. సినిమా పోయినా పర్లేదు..కాస్త ఒకరినొకరు పొగుడుకుందాం అని పెద్ద ఎత్తున ఆడియోలాంచీలు చేస్తోంది ఈ మధ్య కాలంలో ! 😉

కొందరు పొగడ్తలని వినమ్రంగా స్వీకరిస్తారు. కొందరు పట్టించుకోరు. కొందరు అతిగా పొంగిపోయి తడబడతారు. వాళ్లకి వాళ్ళగురించి సరైన అభిప్రాయం లేక పొగడ్తలకి కుంగిపోయే వాళ్ళు కూడా ఉన్నారండోయ్.

కొందరు నెగెటివ్ పొగడ్తలకి అలవాటు పడతారు.అంటే మంచి పనుల్లో కాక చెడుపనుల్లో గొప్ప అవ్వాలని చూస్తారు. సాటిమనుషులని పీడించి వచ్చే చెడ్డపేరులో గొప్పఫీలవుతారు. నన్ను చూస్తే జనాలు భయపడాలి అని అనుకునేవాడు పెద్ద రౌడీగా మారుతాడు. చిన్నప్పుడూ, టీన్స్ లో ఈ నెగెటివ్ పొగడ్తలకి అలవాటు పడ్డవాళ్ళు క్రిమినల్స్ గా మారే అవకాశం ఉంది.

ఇలా నేను పొగడ్తని పొగడుతూ పోతే మరో నాలుగుపేజీలు దాటుతుంది. అతిగా పొగడ్డం కూడా మంచిది కాదు కనక ఇంతటితో ఆపుతున్నాను. అర్థాంతరంగా అపేసా అని నన్ను పొగట్టం మానద్దండోయ్..! 😉

రాండంగా…..

రాముడనే రాజును ఎలా పొగిడారయ్యా అంటే…

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

అజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి 

chakrdhar rao

Leave A Reply