జానపద కళా వారసత్వం తప్పక తెలుసుకోవాల్సిన 6 జానపదకళలు

0

ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాల్ని జానపద కళలు అందిస్తాయనడంలో అతిశయోక్తి లేదంటున్నారు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. శతాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న ఆరు జానపద కళల గురించి ఇలా వివరించారు.

చిందుయక్ష గానం:
మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. వీరు సంస్కృతీ పరివాహకులు. చిందులు తమ కళను ప్రదర్శించుకుంటూ ఊరూరా తిరుగుతారు. జాంభపురాణం వంటి కులకథలను ప్రదర్శిస్తూ కులపురాణాలను వల్లె వేస్తూ మాదిగలకు వినోదాన్ని కలిగిస్తుంటారు. మద్దెల, హార్మోనియం, తాళాలు వాయిస్తూ వాటికి అనుగుణంగా నాట్యం చేస్తూ కథ చెప్తారు. ఈ వేషాల్లో ఎల్లమ్మ వేశం, సోడిగాడి వేషం చూడముచ్చటగా ఉంటాయి. సోడిగాడు వచ్చెరా.. సోద్యమెల్ల వచ్చెరా అంటూ హాస్యగానాలు చేస్తూ ఉంటారు.

బుర్రకథ:
వినరా భారత వీరకుమారా విజయం మనదేరా.. తందాన తానా అనే పలుకులు వినిపిస్తే చాలా ముచ్చటగొలుపుతుంది కదా. ఆ కళారూపమే బుర్ర కథ. తెలంగాణలో జానపద వినోద గాన ప్రక్రియలో ప్రభోదానికి.. ప్రచారానికి సాధనంగా నేటికీ ఈ బుర్రకథను విస్తృతంగా వాడుతున్నారు. బుర్రకథను ముగ్గురు ప్రదర్శిస్తారు. వీరిని కథ, రాజకీయం, హాస్యంగా పిలుస్తారు. మధ్యలో కథకుడు పాడేదానికి చెప్పేదానికి అటూఇటుగా ఉన్న ఇద్దరూ తందాన తానా అని అందుకుంటారు. మాట, పాట, ఆటల ద్వారా భావ వ్యక్తీకరణ చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు.

ఒగ్గుకథ:
శరణు శరణు మాయమ్మా రాణి.. శాంభావీ రాణీ.. శాంభావీ రాణి అనే పాటతో ప్రారంభమవుతుంది ఒగ్గుకథ. ఈ కథాగాన కళా ప్రదర్శనలో ఒకరు ప్రధాన కథకులు. ఒగ్గు కథను చెప్పేవాళ్లను ఒగ్గు గొల్లలు అంటారు. ప్రేక్షకుడికి విరామం లేకుండా కట్టిపడేసే కళ ఒగ్గుకథ. జానపద కళారూపాల్లో ఒగ్గుకథ ప్రధానమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం. గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు మల్లన్న, బీరప్పల కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఇది. డోలు, తాళం డిల్లెం బల్లెం చప్పుళ్లతో అర్థమయ్యేలా చెప్తుంటారు.

లంబాడీ నృత్యాలు:
మైదాన ప్రాంతానికి చెందిన బంజారా గిరిజనులు ఈ కళను ప్రదర్శిస్తారు. లంబాడా తండాల్లో ఏ కార్యం జరిగినా.. పెండ్లి జరిగినా.. పుట్టుకలు.. చావులకు వీరు పాటలతో డ్యాన్సులు చేస్తారు. మారో బాపై బజరజ్ హూంసియో కనాయియో.. ఓరి భేటిపూన తీజ్ బొరాదు కేరోయే అంటూ తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెండ్లికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలని తొమ్మిది రోజులపాటు మేరమ్మ, త్వల్జ, సీత్ల, మత్రల్, హింగళ, ధ్వాళ్ దేవతలకు మొక్కుతారు. నవధాన్యాలను బుట్టలో వేసుకుని శాస్త్రీయంగా నృత్యం చేస్తారు.

పట్నాల కథ:
ఇది కూడా చాలా ప్రాచీనమైది. కేవలం తెలంగాణ ప్రాంతంలోనే రూపుదిద్దుకున్న కళ ఇది. ఒగ్గుకళకు దీనికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒగ్గుకళలో కథ చెప్పడానికి బృందం అవసరం. అలాంటి బృందంలో దేహదారుఢ్యమున్నవారు.. చక్కని గొంతున్నవాళ్లు.. ఎవరి పని వాళ్లు చేస్తుంటారు. అది వారి కళా నైపుణ్యాన్ని బట్టి పాత్రల ఎంపిక ఉంటుంది. పట్నాల కథ కూడా అలాంటిదే. వాళ్లు వేసే పట్నాలు.. వాడే రంగులు చూస్తే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ కూడా వారి కళా నైపుణ్యం కిందే అని చెప్పొచ్చు. అంతటి గొప్ప నైపుణ్యమున్న కళా ప్రదర్శన పట్నాల కథ.
గుస్సాడీ నృత్యాలు: కొండల్లో కోయిల పాటలు పాడుతూ రే రేలా రే రేలా అంటూ రేలపాటలు పాడే గోండు జాతి గిరిజనులకు సంబంధించింది ఈ కళ. పక్షులు, జంతువులు, అడవితో వాళ్లకు విడదీయరాని బంధం. పక్షులు, జంతువులు, అడవి ఆకృతులతో అలంకరించుకుని గుస్సాడీ నృత్యాలు చేస్తుంటారు. నెత్తిపైన నెమలి ఈకలలో సమూహమంతా లయబద్దమైన నృత్యాలు చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. వీటితో మరే కళను పోల్చలేనంత గొప్ప అనుభూతిని కల్గిస్తాయి గోండు కళాకారుల నృత్య ప్రదర్శనలు.

Leave A Reply